Advertisement

సీఎం సొంత ఊరి ముందే కరెంట్ కోసం ధర్నానా?: హరీశ్‌రావు

నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే ఉచిత విద్యుత్ కోసం రైతులు రహదారిపై ధర్నాకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ట్రాక్టర్లతో మెరుపు ధర్నా, రాస్తారోకో చేపట్టడం రాష్ట్రంలోని ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కనీసం 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోందని హరీశ్ రావు దుయ్యబట్టారు. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్లపైకి వస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమన్నారు. సొంత ప్రాంతంలోనే విద్యుత్ సమస్యను పరిష్కరించలేని సీఎం, రాష్ట్ర రైతాంగ సమస్యలను ఎలా తీరుస్తారని నిలదీశారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే రైతులు జాతీయ రహదారిపై పోరాడాల్సి రావడం ‘ప్రజా పాలన’ అనిపించుకుంటుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మార్పు అంటే కరెంట్ కోతలేనా అని ధ్వజమెత్తిన ఆయన, వెంటనే స్పందించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement