Advertisement

ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లోనే సీసీ టీవీలు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే వీటిని అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నామని మంత్రి సభలో పునరుద్ఘాటించారు.

అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాలు, గ్రామీణ రూట్లలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చే ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి దాదాపు 50 నుంచి 60 లక్షల మంది భక్తులు వస్తారని పేర్కొంటూ, వారి సౌకర్యార్థం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement