Advertisement

హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి Vangalapudi Anitha అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. హ్యాకర్లు ఆమె ఖాతాను స్వాధీనం చేసుకుని, ప్రొఫైల్ డీపీతో పాటు పాత పోస్టులను కనిపించకుండా చేశారు. అనంతరం క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఒక స్కామ్ లింక్‌ను ప్రొఫైల్‌లో పిన్ చేశారు. ‘FXRP’ ఫైర్‌లైట్ ప్రోటోకాల్ సంస్థకు చెందిన రివార్డ్స్ పేరుతో అనుమానాస్పద పోస్ట్ ప్రత్యక్షం కావడంతో ఈ హ్యాకింగ్ విషయం బయటపడింది.

తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన మంత్రి అనిత వెంటనే స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సైబర్‌ క్రైమ్‌ ఐజీ రవికృష్ణతో మాట్లాడి పరిస్థితులపై చర్చించారు. ఈ హ్యాకింగ్ వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, హ్యాకర్ల ఆచూకీ కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement