తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త చేయూత పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు

మన పత్రిక: తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన పారదర్శకత కోసం నిర్వహిస్తున్న లైవ్ అథెంటిఫికేషన్ ముఖ గుర్తింపు సర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను ఆదేశించింది. ఈ సర్వే సమగ్ర నివేదికను ఆగస్టు 5 లోపు ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, విధవలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు. గత మూడు నెలలుగా సాగుతున్న తనిఖీల్లో ప్రాథమికంగా లక్షా 21 వేల మందికి పైగా అనర్హులుగా తేలారు. మరోవైపు, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వెయ్యి మందికి పైగా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు స్వచ్ఛందంగా తమ ఆసరా పింఛన్లను వదులుకున్నారు. సెర్ప్ అధికారులు ఈ నెలాఖరుకు సర్వే ముగించి, నివేదిక ఇచ్చిన వెంటనే కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోనున్నారు.