Advertisement

సీజేపీ నిరసనల్లో సీక్రెట్ యాప్స్ వినియోగంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు

మన పత్రిక, ఢిల్లీ: చలో పార్లమెంట్ నిరసనల సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థులు సీక్రెట్ యాప్స్ ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా దీక్ష చేస్తున్న విద్యార్థులు, సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించారు. బ్లూటూత్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేసే ప్రత్యేక యాప్‌ల ద్వారా గ్రూపు సభ్యులు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 118 మంది పోలీసు సిబ్బంది, 70 మంది నిరసనకారులు గాయపడగా, 15 నుండి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి.

చాటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు

పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాల్లో తీవ్రస్థాయి రాజకీయ వ్యాఖ్యలు ఉన్నట్లు సమాచారం. నిరసనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని, మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు అని చాటింగ్‌లో సందేశాలు ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేసినప్పటికీ, బ్లూటూత్ యాప్‌ల లింక్‌లను షేర్ చేస్తూ గ్రూపు సభ్యులు సంభాషణలు సాగించారు. ఈ డిజిటల్ ఆధారాలు, చాట్‌ల మూలాలను నిర్ధారించేందుకు సైబర్ నిపుణుల సాయంతో ఫోరెన్సిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలా లేదా హింసను ప్రేరేపించే కుట్రలో భాగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement