Advertisement

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులో తల్లిదండ్రుల ఆధార్ తప్పనిసరి

మన పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu Application) పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈ దరఖాస్తుల నమోదులో ఒక కీలక నిబంధన లబ్ధిదారులకు పెద్ద సవాలుగా మారింది. దరఖాస్తుదారుల వివరాలతో పాటు, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డుల వివరాలను కూడా సిస్టమ్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ కొత్త నిబంధన కారణంగా మీసేవ కేంద్రాలకు వెళ్తున్న పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుల ఆధార్ వివరాలు నమోదు చేయని పక్షంలో దరఖాస్తులు స్వీకరించబడటం లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు చనిపోయిన వారు లేదా ఆధార్ కార్డులు లేని వారి దరఖాస్తులు నిలిచిపోతుండటంతో, అధికారులు దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు, దరఖాస్తుల స్వీకరణ తొలిరోజే మీసేవ కేంద్రాల్లో సర్వర్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత సాంకేతిక సమస్యలు కొంతమేర పరిష్కారం కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పుంజుకుంది.

Advertisement
Advertisement