Advertisement

అమెరికాలో గుండెపోటుతో పల్నాడు యువకుడు మృతి

మన పత్రిక, పల్నాడు: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడిన పల్నాడు జిల్లాకు చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) గుండెపోటుతో మరణించారు. పల్నాడు జిల్లా, గురజాల మండలం, దైద గ్రామానికి చెందిన రవితేజ 2013లో అమెరికా వెళ్లారు. ఒహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో నివసిస్తున్న ఆయన, ఇటీవలే సొంతంగా ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఈ కొత్త ఇంటి గృహప్రవేశ వేడుక కోసం తన తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావులను అమెరికాకు పిలిపించుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఈ నెల 18వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కొద్దిసేపటికే రవితేజకు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే 911కు సమాచారం అందించగా, పారామెడికల్ సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళంలో లోపలి పొర చిరిగిపోయిందని వైద్యులు గుర్తించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసినప్పటికీ రవితేజ ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స పొందుతూ ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. రవితేజకు భార్య వందన, రెండేళ్ల కుమారుడు విహాన్ ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం కష్టమని భావించి, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Advertisement
Advertisement