మన పత్రిక, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ కేసులో భాగంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా అధికారిణి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని తెలుసుకున్న ఉదయ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన రక్త నమూనాల్లో ఎటువంటి విషపూరిత పదార్థాలు లేవని, కేవలం అధికంగా మద్యం సేవించడం వల్లే స్పృహ తప్పారని వైద్యులు తేల్చడంతో, ఇది కేసు నుంచి తప్పించుకునేందుకు ఆడిన నాటకమేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
మద్యం మత్తులో లేఖ
ఆసుపత్రిలో చేరడానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం మత్తులో ఒక లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, సదరు మహిళా అధికారిణితో తనకు ఏడాదిగా పరిచయం ఉందని అందులో పేర్కొన్నారు. తమ మధ్య జరిగిన వాట్సప్ చాట్లు, ఫొటోలు, వీడియోలను ఆమె భర్తకు పంపించానని, తన పరిస్థితికి ఆ మహిళతో పాటు మరో నలుగురు కారణమని లేఖలో ఆరోపించారు. ఈ ఘటనపై నేషనల్ పోలీస్ అకాడమీ పాలకమండలి ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపనున్నారు. అత్తాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
