Advertisement

హైదరాబాద్‌లోని రెండు హోటళ్లకు రూ.20 లక్షల జరిమానా విధించిన హైకోర్టు

మన పత్రిక, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ హోటళ్లకు తెలంగాణ హైకోర్టు భారీ జరిమానా విధించింది. కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాయని పేర్కొంటూ, అబిడ్స్‌లోని బి. సుందర్ రావు తాజ్ మహల్ హోటల్ మరియు సికింద్రాబాద్‌లోని సుందర్ తాజ్ మహల్ హోటల్ (హోటల్ తాజ్ 3 స్టార్) యాజమాన్యాలకు చెరో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల జరిమానాను జస్టిస్ నాగేష్ భీమపాక విధించారు. ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అథారిటీకి జమ చేయాలని కోర్టు ఆదేశించింది.

విద్యుత్ సర్చార్జీల వివాదం

టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) జారీ చేసిన విద్యుత్ క్రాస్ సబ్సిడీ సర్చార్జీ డిమాండ్ నోటీసులను సవాల్ చేస్తూ ఈ హోటళ్లు హైకోర్టులో రిట్ పిటిషన్లను దాఖలు చేశాయి. ఒక హోటల్‌కు రూ.27.5 లక్షలు, మరొక హోటల్‌కు రూ.77.7 లక్షల సర్చార్జీ చెల్లించాలని విద్యుత్ సంస్థ నోటీసులు పంపింది. తాము నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నందున 2005 నాటి నిబంధనల ప్రకారం ఎలాంటి సర్చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని హోటల్ యాజమాన్యాలు తమ వాదనను వినిపించాయి.

Advertisement

కోర్టును తప్పుదారి పట్టించారని ఆగ్రహం

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా విద్యుత్ సంస్థ తరపు న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సదరు హోటల్ యాజమాన్యాలు గతంలోనే ఈ నోటీసులపై కేసులు వేసి, అనుమతి లేకుండానే వాటిని ఉపసంహరించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు గతంలోనే విద్యుత్ సంస్థను ఆశ్రయించిన విషయాన్ని కూడా ఆయన కోర్టు ముందు ఉంచారు. కీలక విషయాలను దాచిపెట్టి కోర్టును తప్పుదారి పట్టించేలా వ్యవహరించినందుకు ధర్మాసనం ఈ జరిమానాను ఖరారు చేసింది.

Advertisement