.
మన పత్రిక: తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు
విషయం: జీవో నెం.25 ప్రకారం 150 లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో PSHM పోస్టులను SGT పోస్టులుగా గుర్తించిన నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఆయా పాఠశాలల్లో PSHMలను హెడ్‌మాస్టర్లుగానే కొనసాగిస్తూ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా జీవోను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన సూచనలు చేయవలెనని విజ్ఞప్తి.
మహోదయులకు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిజమైన పునాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలే. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే ఉన్నత పాఠశాలల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తు బలపడతాయి. అందువల్ల ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఉపాధ్యాయ సంఘం యొక్క నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత.
ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నెం.25లో భాగంగా 150 లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో PSHM పోస్టులను SGT పోస్టులుగా గుర్తించడం ప్రాథమిక విద్య పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయంగా కనిపిస్తోంది. ఒక పాఠశాలకు హెడ్‌మాస్టర్ అనేది కేవలం ఒక పోస్టు మాత్రమే కాదు; పాఠశాల విద్యా, పరిపాలనా, పర్యవేక్షణ వ్యవస్థకు నాయకత్వం వహించే బాధ్యతాయుతమైన స్థానం. అలాంటి పోస్టును విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టి SGT పోస్టుగా పరిగణించడం వల్ల ప్రాథమిక పాఠశాలల నిర్వహణ బలహీనపడే ప్రమాదం ఉంది.
అదే సమయంలో, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఖాళీగా ఉన్న PSHM పోస్టులకు పదోన్నతులు ఇవ్వడం జరుగుతోంది. ఒకవైపు PSHM పోస్టులను SGTలుగా గుర్తించడం, మరోవైపు PSHM పదోన్నతులు కల్పించడం పరిపాలనా పరంగా విరుద్ధమైన విధానంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించడం అత్యవసరం.
మరోవైపు ప్రభుత్వ హైస్కూల్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి పాఠశాలకు PGHM, స్కూల్ అసిస్టెంట్లు 7, PET తదితర పోస్టులు కొనసాగుతున్నాయి. కానీ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులను తగ్గించడం వల్ల ఒకే ఉపాధ్యాయుడు బహుళ తరగతులకు బోధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది నాణ్యమైన విద్య లక్ష్యాలకు విరుద్ధం.
ప్రతి హైస్కూల్‌కు హెడ్‌మాస్టర్ ఉన్నట్లే, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా ఒక PSHM, ప్రతి తరగతికి ఒక SGT ఉండే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇదే విద్యార్థుల హక్కు, ఇదే ప్రభుత్వ విద్యాభివృద్ధికి సరైన మార్గం.
ప్రభుత్వ హైస్కూల్లలో వస్తున్న 98%, 99%, SSC ఫలితాలకు పునాది వేసేది ప్రాథమిక పాఠశాలలే. SGTల కృషి, PSHMల పర్యవేక్షణ, ప్రాథమిక స్థాయిలో అందుతున్న నాణ్యమైన బోధన లేకుండా ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యం కావు. కాబట్టి ప్రాథమిక విద్యను బలహీనపరిచే ఏ నిర్ణయమైనా చివరికి మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
ప్రాథమిక పాఠశాలల్లో పరిపాలనా నాయకత్వం బలహీనపడితే విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి. విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు తగ్గుతాయి. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం తగ్గి, ప్రైవేట్ పాఠశాలల వైపు మరింత మంది వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు శ్రేయస్కరం కాదు.
అందువల్ల రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ అంశాన్ని అత్యంత బాధ్యతతో పరిశీలించి, 150 లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో PSHM పోస్టులను SGT పోస్టులుగా గుర్తించిన నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని, PSHMలను ఆయా పాఠశాలల్లో హెడ్‌మాస్టర్లుగానే కొనసాగించాలని, అలాగే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా జీవో నెం.25లో తక్షణ సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన సూచనలు చేయవలసిందిగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రాథమిక విద్యను పరిరక్షించడం అంటే కేవలం ఒక క్యాడర్‌ను కాపాడటం కాదు; తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తును కాపాడటమే. ఈ విషయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు తమ చారిత్రాత్మక బాధ్యతను నిర్వర్తించి ప్రభుత్వం ముందు ఏకగ్రీవంగా ఈ డిమాండ్‌ను వినిపిస్తాయని ఆశిస్తున్నాను.
“ప్రాథమిక పాఠశాల బలపడితేనే ప్రభుత్వ విద్య బలపడుతుంది.
PSHMను పరిరక్షించడం అంటే ప్రాథమిక విద్యా నాయకత్వాన్ని పరిరక్షించినట్టే.”
ఇట్లు,
కలవల శంకర్
ఎస్.జి.టి.
మొబైల్: 9440750178

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- జులై 18న స్టాక్ మార్కెట్లకు సెలవు: వివరాలు ఇవే
- విదేశీ ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయల మోసం: ఫ్లయింగ్ బోర్డర్స్ గుట్టురట్టు
- సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: లూనాను ఢీకొన్న వాహనం
- వరంగల్ జిల్లాలో నకిలీ బంగారం మోసం: రూ.11 లక్షలు పోగొట్టుకున్న వృద్ధురాలు
- తెలంగాణలో ఆలస్యమైన వర్షాలు: వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం
