మన పత్రిక: రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగంగా మరియు సులభంగా మార్చే లక్ష్యంతో భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన పోర్టల్‌పై వినియోగదారుల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం, దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వినియోగదారులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లింక్ ద్వారా లేదా పాత హోమ్‌పేజీలో ఉన్న ‘బీటా వెర్షన్’ లింక్ ద్వారా దీనిని యాక్సెస్ చేయవచ్చు.
కొత్త వెబ్‌సైట్‌లో మార్పులు
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త వెబ్‌సైట్‌లో పలు విప్లవాత్మక మార్పులు చేశారు. టికెట్ బుకింగ్ సమయంలో వినియోగదారులకు ఇబ్బంది కలిగించే క్యాప్చా ఎంట్రీ విధానాన్ని గణనీయంగా తగ్గించారు. ఎలాంటి అనవసరమైన ప్రకటనలు, పాపప్‌లు లేకుండా బుకింగ్ చేసుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఒకే స్క్రీన్‌పై వివిధ క్లాసుల సీట్ల లభ్యతను నేరుగా చూసుకునే సదుపాయాన్ని కల్పించడంతో పాటు, ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే ఫీచర్‌ను మెరుగుపరిచారు.
విద్యార్థుల సూచనలతో అభివృద్ధి
ఈ వెబ్‌సైట్ రూపకల్పనలో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థుల పాత్ర కీలకమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిపిన సమావేశంలో విద్యార్థులు ఇచ్చిన యూజర్ అనుభవం (UI/UX) మెరుగుపరిచే సలహాల ఆధారంగానే ఈ మార్పులు చేశారు. 2002లో ప్రారంభమైన ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 14.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి.
ట్రయల్ రన్ పూర్తికాగానే, కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో ఈ వెబ్‌సైట్‌ను అనుసంధానించనున్నారు. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ నూతన పోర్టల్ అధికారికంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
