Advertisement

అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో శ్రీ సాయి చందన పరిశ్రమలో అగ్నిప్రమాదం

మన పత్రిక, పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మాసిటీలోని శ్రీ సాయి చందన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదానికి గల కారణాలు

పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్-2లో ఉన్న రియాక్టర్ వద్ద రసాయనాలు లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ వద్ద భారీ శబ్దంతో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. లోపల ఉన్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్‌లో ఉన్న సిబ్బంది సంఖ్య, జరిగిన ఆస్తి నష్టంపై యాజమాన్యం మరియు అధికారులు అంచనా వేస్తున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement