Advertisement

కాళేశ్వరంపై అసెంబ్లీ ప్రత్యేక చర్చకు సిద్ధం.. | CM Revanth Reddy

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు కోరిన రోజునే అసెంబ్లీ, కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని, దీనిపై స్పీకర్‌కు లేఖ రాసి తేదీ ఖరారు చేయాలని ఆయన కోరారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో “కూలిన కాళేశ్వరం – వైఫల్యాల నుంచి పునర్నిర్మాణం వైపు” అనే అంశంపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తో పాటు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అందజేసిన నివేదికల సారాంశాన్ని ఈ సందర్భంగా ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

పరిష్కారం చూపిస్తే ప్రతిపక్షానికే అప్పగిస్తాం

లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును ఎలాగైనా నిలబెట్టుకోవాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “ప్రాజెక్టును మాకు అప్పగించాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. నిపుణులు, మేధావులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించగలిగితే, ప్రాజెక్టు మరమ్మతు పనులను వారి ఆధ్వర్యంలోనే కొనసాగించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలూ, బేషజాలూ లేవు” అని సీఎం రేవంత్ రెడ్డి నిర్మొహమాటంగా ప్రకటించారు. అయితే, నిపుణులు పరిష్కారం చూపించకుండా బ్యారేజీలో హడావిడిగా నీళ్లు నింపితే మరింత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

నిర్మాణ లోపాల వల్లే కుప్పకూలింది

గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తక్కువ వ్యయంతో గ్రావిటీ ద్వారా నీరందించేలా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేయగా, ఆ తర్వాత రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చి వ్యయాన్ని రూ. 1.47 లక్షల కోట్లకు పెంచారని కాగ్ (CAG) తప్పుబట్టిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయని 2020లోనే ఒక అధికారి నివేదించినా, ఎల్ అండ్ టీ సంస్థకు లేఖలు రాసినా నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అది పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. లూస్ సాయిల్ (ఇసుక తిన్నెలు) ఉన్న ప్రాంతంలో పునాది భూ పటిష్టతను లెక్కచేయకుండా బ్యారేజీలు కట్టడం వల్లే గేట్ల అలైన్‌మెంట్లు తప్పాయని, కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయిందని విమర్శించారు. నాణ్యత, నిర్మాణ, నిర్వహణ లోపాల వల్లే ప్రాజెక్టు దెబ్బతిన్నదని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా తేల్చిందని చెప్పారు.

అప్పులు కడుతూనే సంక్షేమం అమలు చేస్తున్నాం

కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం రూ. 97 వేల కోట్లు అప్పుచేస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే తమ ప్రభుత్వం రూ. 33 వేల కోట్ల అప్పు చెల్లించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేసీఆర్ హయాంలో కట్టిన సెక్రటేరియట్, ప్రజాభవన్‌లను ప్రస్తుతం వాడుతున్నట్లే, కాళేశ్వరం కూడా ప్రజల కోసం ఉపయోగపడే పరిస్థితి ఉంటే కచ్చితంగా వాడుకుంటామని స్పష్టం చేశారు. అప్పులు చెల్లిస్తూనే రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని, తొలి ఏడాదిలోనే 67,618 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement