మన పత్రిక, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) పాలనా సంస్కరణల భాగంలో దాదాపు మూడు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న పాత అకౌంటింగ్ విధానాన్ని ఆధునికీకరించాలని పాలకవర్గం నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పీ (ERP) ఆధారిత అకౌంటింగ్ వ్యవస్థ అమల్లో ఉండగా, తాజా అవసరాలకు అనుగుణంగా దీన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించింది.
ఈ అకౌంటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ICAI) సమగ్ర అధ్యయనం చేపట్టింది. ఐసీఏఐకి చెందిన అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాన్ని ప్రారంభించింది. తాజా నిబంధనలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త అకౌంటింగ్ మాన్యువల్‌ను రూపొందించి టీటీడీకి అందించనుంది. టీటీడీ ఆర్థిక నియమావళిలో అవసరమైన సవరణలను కూడా ఈ అధ్యయన నివేదిక ద్వారా సూచించనున్నారు.
శ్రీవారి ఆలయానికి వచ్చే విరాళాలు, వివిధ విభాగాల ఆదాయం, ఖర్చులు, ఆస్తుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వివరాలన్నింటినీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రమబద్ధంగా నిర్వహించడమే ఈ సంస్కరణల ముఖ్య లక్ష్యం. కంపెనీస్ యాక్ట్‌లో వచ్చిన తాజా మార్పులు, నూతన అకౌంటింగ్ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త విధానాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన రద్దీ సోమవారం నాటికి కూడా కొనసాగుతుండగా, ఈ నెలాఖరు వరకు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్, వసతి గదుల కేటాయింపులో నూతన సాంకేతిక విధానాలను టీటీడీ ఇప్పటికే అమలు చేస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
