మన పత్రిక వెబ్‌డెస్క్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలనా వ్యవహారాలపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సమీక్ష నిర్వహించారు. టీటీడీ వేద పాఠశాలల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అంతర్గత ఆడిట్ సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు విభాగాల పనితీరుపై దిశానిర్దేశం చేశారు.
కల్యాణ మండపాలపై సమగ్ర నివేదిక దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహణలో ఉన్న కల్యాణ మండపాల స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఈవో ఆదేశించారు. భక్తులకు అందుబాటులో ఉన్నవి, ఆదరణ లేనివి, ఆధునీకరించిన మండపాల వివరాలను సేకరించి, భక్తులు వాటిని సౌకర్యవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించి పాలక మండలికి నివేదించాలన్నారు.
రికార్డుల డిజిటలైజేషన్ టీటీడీ ఆలయాల్లోని తిరువాభరణాల రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి పక్కాగా డాక్యుమెంట్ చేయాలని ఈవో సూచించారు. అలాగే టీటీడీ ఆస్తులు, భూములకు సంబంధించి కచ్చితమైన రికార్డుల తయారీకి నిపుణుల సాయం తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరపాలని, అటవీ శాఖ పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
భక్తుల కోసం క్యూఆర్ కోడ్ వసతి గృహాల్లో సేవలను మెరుగుపరిచేందుకు ఎఫ్.ఎం.ఎస్ (FMS) యాప్‌ను భక్తులకు మరింత చేరువ చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఫీడ్‌బ్యాక్‌ను నేరుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
