మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ కష్టాలు తప్పనున్నాయి. ఇప్పటి వరకు వాహనం కొంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే షోరూమ్‌లో జరిగేది, శాశ్వత రిజిస్ట్రేషన్ (PR) కోసం వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ జనవరి 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం, ఇకపై మీరు వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. దీనివల్ల సామాన్యులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, దళారుల బెడద కూడా తప్పుతుంది.
ఈ కొత్త విధానంలో వాహనాన్ని విక్రయించిన డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత, ఆర్టీవో కార్యాలయం నుంచి అధికారుల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించబడుతుంది. ఒకవేళ వాహన తనిఖీ అవసరమని భావిస్తే, రవాణా శాఖ అధికారులే నేరుగా షోరూమ్‌కు వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆర్టీవో ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అయితే, ఈ వెసులుబాటు కేవలం వ్యక్తిగత వాహనాలకు (నాన్-ట్రాన్స్పోర్ట్) మాత్రమే వర్తిస్తుందని, వాణిజ్య (కమర్షియల్) వాహనాలకు మాత్రం పాత పద్ధతిలోనే ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
రవాణా శాఖలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రవాణా శాఖకు చెందిన ‘సారథి’ పోర్టల్‌లో చేరిన నేపథ్యంలో ఈ సేవలు మరింత సులభతరం కానున్నాయి. షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్‌తో పాటు ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ వంటి అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని రకాల సేవలను ఆన్లైన్ ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా రవాణా శాఖ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
