Advertisement

తెలంగాణలో త్వరలో రానున్న లిఫ్ట్ భద్రతా చట్టం

మన పత్రిక: రాష్ట్రంలో తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం Lift Safety Act పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. భవనాలు, విద్యాసంస్థలు మరియు షాపింగ్ మాల్స్‌లో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు ‘తెలంగాణ లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ ముసాయిదా బిల్లు’ రూపకల్పన ఇప్పటికే పూర్తయింది.

ఈ ముసాయిదా బిల్లుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం దీనిని మంత్రివర్గం, ఆపై శాసనసభ ముందుకు తీసుకురానున్నారు. లిఫ్టుల్లో సాంకేతిక లోపాల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిల్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ చట్టం గురించిన వివరాలను వెల్లడించింది.

Advertisement

కొత్త చట్టంలోని ముఖ్యాంశాలు

ఈ చట్టం అమల్లోకి వస్తే లిఫ్టుల తయారీ సంస్థల రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్ బీఎస్ఐ (BSI) నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రభుత్వ ఇన్‌స్పెక్టర్ల ద్వారా ఏటా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. నాణ్యత లేని లిఫ్టుల తయారీపై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అవినాష్ చల్లా స్వాగతించారు. అయితే, లిఫ్టులపై ప్రస్తుతం విధిస్తున్న 18% జీఎస్‌టీని తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement