మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య తగ్గుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన సుమారు 23 వేల కార్డుల కంటే.. ఈసారి ఎక్కువగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం సచివాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
జీవో 252లో సవరణలు జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు సంబంధించిన జీవో 252లో మార్పులు, చేర్పులు చేస్తామని మంత్రి తెలిపారు. జర్నలిస్టు సంఘాలు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఏ ఒక్కరి గౌరవాన్ని తగ్గించడం తమ ఉద్దేశం కాదని, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేయడానికే శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశామని వివరించారు.
మీడియా కార్డు = అక్రిడిటేషన్ కార్డు అక్రిడిటేషన్ కార్డుకు, మీడియా కార్డుకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి అందే ప్రతి ప్రయోజనం (రాయితీలు, పథకాలు) మీడియా కార్డుదారులకు కూడా అందుతాయని స్పష్టం చేశారు.
కొత్తగా ఎవరెవరికి?
- మహిళా జర్నలిస్టులు: ప్రత్యేక కోటా కేటాయింపు.
- ఉర్దూ జర్నలిస్టులు: అక్రిడిటేషన్ కమిటీల్లో అవకాశం.
- ఇతర విభాగాలు: క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ జర్నలిస్టులకు కూడా కార్డులు.
- డిజిటల్ మీడియా: దేశంలోనే తొలిసారిగా డిజిటల్ మీడియా కార్డులు మంజూరు చేసిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.
వెరిఫికేషన్ పక్కా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సర్క్యులేషన్ వివరాలు, చార్టెడ్ అకౌంటెంట్ (CA) సర్టిఫికెట్ల పరిశీలన కచ్చితంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇక ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు అడ్డంకులు ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యాయపరమైన చిక్కులు లేని విధానాన్ని రూపొందించి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
