Advertisement

పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌మ్యాప్: 2037 నాటికి ఒక ట్రిలియన్

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాలు మరియు అందిస్తున్న ప్రోత్సాహకాలను సీఐఐ నార్త్ రీజియన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఉన్న మౌలిక రంగా సమస్యలు ఇక్కడ తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

మూడు విభాగాలుగా మౌలిక వసతుల విస్తరణ

ఇతర పెద్ద నగరాల తరహాలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ భాగాలుగా వర్గీకరించినట్లు సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ ప్రాధాన్యంగా క్యూర్ పరిధిలోకి, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి కేటాయిస్తూ ప్యూర్ పరిధిలోకి తెచ్చినట్లు వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు వెలుపలి రేర్ ప్రాంతంలో వ్యవసాయం, అగ్రి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

ఫ్యూచర్ సిటీ, రవాణా ప్రాజెక్టులు

హైదరాబాద్ శివార్లలో 30,000 ఎకరాల్లో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తామని, విభిన్న విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. శంషాబాద్ నుంచి చెన్నై, పూణె, బెంగళూరు మార్గాల్లో బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని చెప్పారు.

పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాలు

దేశీయంగా జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం ఐదు శాతంగా ఉందని, దానిని 10 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. పొరుగు రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడి చైనా ప్లస్ వన్ కంట్రీగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని అన్నారు. 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement