Advertisement

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు భద్రత ఉపసంహరణను సమర్థించిన హైకోర్టు

మన పత్రిక, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జలగం ప్రసాదరావుకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది (పీఎస్ఓ) ఉపసంహరణను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఆయనకు ప్రస్తుతం ఎలాంటి ప్రాణభయం లేదని, అందువల్ల భద్రతను కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జలగం ప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ టి.మాధవీదేవి కొట్టివేశారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, పిటిషనర్ విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే సెక్యూరిటీ రివ్యూ కమిటీ, పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయానికి వచ్చారని న్యాయస్థానం పేర్కొంది.

వ్యక్తిగత భద్రతను నిరంతరం పొందడం అనేది ఎవరికీ చట్టబద్ధమైన హక్కు కాదని, ఇది కేవలం ముప్పు అంచనా ఆధారంగా తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయమని కోర్టు స్పష్టం చేసింది. 1990 నుండి 1994 వరకు మంత్రిగా పనిచేసిన జలగం ప్రసాదరావు, గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా లేరని కోర్టు గుర్తుచేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివసిస్తూ, అప్పుడప్పుడు మాత్రమే తన సొంత గ్రామానికి వెళ్తున్నారని తెలిపింది. పిటిషనర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తీసుకున్న చర్యల వల్ల తమ కుటుంబానికి తీవ్రవాద సంస్థల నుండి ముప్పు ఉందని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు.

Advertisement

ప్రభుత్వ వాదనలను అంగీకరించిన కోర్టు

జూన్ 1, 2026 న జరిగిన భద్రతా సమీక్షా కమిటీ సమావేశంలో జలగం ప్రసాదరావు భద్రతపై సమగ్రంగా చర్చించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సీపీఐ (మావోయిస్టు) లేదా ఇతర తీవ్రవాద సంస్థల నుండి ఆయనకు ఎటువంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేసినట్లు పేర్కొంది. పిటిషనర్‌కు వచ్చిన వాట్సాప్ బెదిరింపు సందేశాల నంబర్ నెల్లూరులోని ఒక దర్జీకి చెందినదని, దానికి తీవ్రవాద గ్రూపులతో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో సమర్పించిన ముప్పు అంచనా నివేదికను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ కేసును ముగించింది.

Advertisement