Advertisement

పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవు: పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక

మన పత్రిక: తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని, పార్టీ విధానాలు మరియూ అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల తాటిపాకలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వివాదంపై ఎమ్మెల్యే బొండా ఉమా ఇచ్చిన వివరణపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ గీత దాటితే ఎంతటివారైనా చూస్తూ ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడమని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాలే అందరికీ శిరోధార్యమని తెలిపారు. ఇతర రాజకీయ ప్రత్యర్థులు, విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హాజరైనా సదరు కార్యక్రమానికే పరిమితం కావాలి తప్ప, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ మాట్లాడకూడదని తేల్చిచెప్పారు.

Advertisement

ఈ వివాదంలో ఎమ్మెల్యే బొండా ఉమా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అధినేత చంద్రబాబు మాట జవదాటనని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని బొండా స్పష్టం చేశారని తెలిపారు. దాంతో ఈ వివాదం ముగిసిన అధ్యాయమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement