మన పత్రిక: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘టీజీ టీ20’ టోర్నమెంట్‌కు బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారని ఆరోపించింది.
ఈ టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ సహా అంబటి రాయుడు, సిరాజ్, తిలక్ వర్మ తదితరులు ఒప్పందాలు చేసుకునే ముందే టోర్నీ చట్టబద్ధతను పరిశీలించుకోవాలని టీసీఏ జనరల్ సెక్రటరీ సూచించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం టోర్నమెంట్ ప్రకటించడానికి 45 రోజుల ముందే బీసీసీఐ అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
హెచ్‌సీఏ ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలను ఫీజులకే ఖర్చు చేస్తోందని, ఈ నిధులతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయవచ్చని టీసీఏ అభిప్రాయపడింది. అలాగే ఖమ్మం, వరంగల్ జట్లలో పలువురు రాజకీయ నాయకుల కుమారుల ప్రమేయంపైనా వారు పలు ప్రశ్నలు లేవనెత్తారు.
