3 కి.మీ నడిచి ఫుడ్ డెలివరీ.. బి.టెక్ గ్రాడ్యుయేట్ గోడు విని కదిలిన మహిళ, లింక్డిన్ పోస్ట్‌తో మారిన తలరాత!
మన పత్రిక, వెబ్‌డెస్క్: ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రియాంశి చాందేల్ ( Shriyanshi Chandel ) , తీవ్రమైన ఆకలితో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ రావడానికి 45 నిమిషాలు ఆలస్యం కావడంతో, ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆలస్యంగా వచ్చిన సాహిల్‌ను చూడగానే ఆమె తిట్టడం మొదలుపెట్టారు.
ఆమె కోపాన్ని అర్థం చేసుకున్న సాహిల్ మౌనంగా మెట్లు దిగడం ప్రారంభించాడు. అయితే, కొన్ని మెట్లు దిగాక అలసిపోయి అక్కడే కూర్చుండిపోయాడు. ఇది గమనించిన ప్రియాంశి, అతని దగ్గరికి వెళ్లి మళ్లీ ప్రశ్నించగా, సాహిల్ చెప్పిన మాటలు ఆమెను దిగ్భ్రాంతికి గురిచేశాయి. తన వద్ద టూ వీలర్ లేదని, ఆమె ఆర్డర్ డెలివరీ చేయడానికి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానని చెప్పాడు.
తాను ఈసీఈలో బి.టెక్ పూర్తి చేశానని, గతంలో నింజా కార్ట్, బైజూస్‌లో పనిచేసినట్లు తెలిపాడు. ఇప్పుడు బైక్ లేకపోవడంతో నడుస్తూనే ఆర్డర్లు డెలివరీ చేస్తున్నానని, ఒక్కో ఆర్డర్‌కు రూ. 20-25 మాత్రమే వస్తాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వారం రోజులుగా టీ, నీళ్లతోనే గడుపుతున్నానని, సరిగ్గా భోజనం కూడా చేయలేదని తన గోడు వెళ్లబోసుకున్నాడు.
అతని పరిస్థితికి చలించిపోయిన ప్రియాంశి కళ్లు చెమ్మగిల్లాయి. వెంటనే అతనికి నీళ్లు ఇచ్చి, తాను తెప్పించుకున్న ఆహారాన్నే సాహిల్‌కు పెట్టి కడుపు నింపింది. నెలకి రూ. 25,000 జీతం వచ్చే ఆఫీస్ బాయ్, అడ్మిన్ లేదా కస్టమర్ సపోర్ట్ వంటి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని సాహిల్ ఆమెను కోరాడు.
వెంటనే స్పందించిన ప్రియాంశి, సాహిల్ విద్యార్హతలు, అనుభవం వివరిస్తూ లింక్డిన్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో, చాలా మంది సాయానికి ముందుకు వచ్చారు. కొందరు డబ్బు, ఆహారం అందించగా.. చివరికి సాహిల్‌కు మంచి ఉద్యోగం కూడా దొరికింది. ఈ విషయాన్ని ప్రియాంశి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
