Advertisement

Suryapet : జడ్పి సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్: కలెక్టర్ ఉత్తర్వులు

మన పత్రిక, సూర్యాపేట: పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్.కె. మెయినోద్దీన్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో ఆధారాలతో సహా రుజువు కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన పరిధిలోని పలువురు పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేపట్టారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా ఆయన అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైంది.

Advertisement

దీంతో కఠిన చర్యలు తీసుకున్న కలెక్టర్, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలే ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Advertisement