Advertisement

ఎస్పీ జానకి షర్మిలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: పోలీసు సంక్షేమ సంఘం

నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసుల ముసుగులో కొంతమంది అనామకులు స్వార్థం కోసం ఎస్పీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు ఎస్పీకి సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎస్పీ జానకి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సిబ్బంది తమ సమస్యలను నేరుగా ఎస్పీకి చెప్పుకునే వెసులుబాటు కల్పించారని, చరిత్రలో ఎడలేవిధంగా హోంగార్డులు కూడా నేరుగా ఆమెను కలిసి సమస్యలు విన్నవించుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొంది.

శాఖాపరమైన పరిపాలనా చర్యలను, బదిలీలను తప్పుదారి పట్టిస్తూ వ్యక్తిగత కక్షలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సిబ్బంది ఆర్థిక సంక్షేమం కోసం కోఆపరేటివ్ రుణాలకు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతిరోజూ గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు, సిబ్బంది సమస్యలను ఎస్పీ స్వయంగా పరిష్కరిస్తున్నారని వెల్లడించింది. బాసర ఐఐఐటీ విద్యార్థుల రక్షణకు ఆమె ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. పారదర్శకంగా జరిగిన పోలీసు సంక్షేమ సంఘం ఎన్నికలకు కుల, మతాల రంగు పులిమి లబ్ది పొందాలని చూస్తున్నారాని ధ్వజమెత్తింది. సోషల్ మీడియా వేదికగా ఎస్పీపై తప్పుడు వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Advertisement
Advertisement