మన పత్రిక: దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాల తేదీలు ఖరారయ్యాయి. 2026 సంవత్సరంలో శరన్నవరాత్రులు అక్టోబర్ 11వ తేదీ ఆదివారం ప్రారంభమై, అక్టోబర్ 19వ తేదీ సోమవారంతో ముగియనున్నాయి. దుర్గాదేవి తొమ్మిది రూపాలైన నవదుర్గలను ఆరాధించే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం, అక్టోబర్ 20వ తేదీ మంగళవారం నాడు విజయదశమి పండుగను జరుపుకుంటారు.
నవరాత్రి మొదటి రోజున ఘటస్థాపన పూజతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా మొదలవుతాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు ఆచరిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19వ తేదీ సోమవారం నాడు దుర్గాష్టమి, మహానవమి పూజలను ఒకే రోజు నిర్వహించనున్నారు. లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, దుర్గాదేవిల పూజలతో పాటు గుజరాత్ వంటి ప్రాంతాలలో గర్బా, దాండియా నృత్యాలతో ఈ వేడుకలు కోలాహలంగా సాగుతాయి.
నవరాత్రులలో ప్రతి రోజును దుర్గాదేవి ఒక్కో విశిష్ట రూపానికి అంకితం చేస్తారు. మొదటి రోజున శక్తికి రూపమైన శైలపుత్రి దేవిని, రెండవ రోజు తపస్సుకు ప్రతీక అయిన బ్రహ్మచారిణిని, మూడవ రోజు ధైర్యానికి సూచికగా చంద్రఘంటా దేవిని అర్చిస్తారు. నాల్గవ రోజు సృష్టి కారకురాలైన కూష్మాండ దేవిని, ఐదవ రోజు కరుణామయి అయిన స్కాందమాతను, ఆరవ రోజు దుష్టశిక్షణకు ప్రతీకగా కాత్యాయిని దేవిని పూజిస్తారు. ఏడవ రోజు నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కల్పించే కాళరాత్రి దేవిని, ఎనిమిదవ రోజు ప్రశాంతతకు రూపమైన మహాగౌరిని, తొమ్మిదవ రోజు జ్ఞానాన్ని ప్రసాదించే సిద్ధిదాత్రి దేవిని భక్తులు కొలుస్తారు.
నవరాత్రులలో ఒక్కో రోజుకు ఒక్కో రంగును ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల క్యాలెండర్లు, సంప్రదాయాల ప్రకారం ఈ రంగులలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. 2026 నవరాత్రి రంగుల వివరాల ప్రకారం మొదటి రోజు ఆరెంజ్, రెండవ రోజు వైట్, మూడవ రోజు రెడ్, నాల్గవ రోజు రాయల్ బ్లూ, ఐదవ రోజు ఎల్లో, ఆరవ రోజు గ్రీన్, ఏడవ రోజు గ్రే, ఎనిమిదవ రోజు పర్పుల్, తొమ్మిదవ రోజు పీకాక్ గ్రీన్ రంగులను ధరించాల్సి ఉంటుంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
