Advertisement

షాబాద్ ఆరుగురి హత్యల కేసు: నిందితుడి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

మన పత్రిక: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన కేసులో నిందితుడు బి. రాజ్ కుమార్ (35) ఆత్మహత్యతో కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. కొత్తూరు మండలం పంజరాల సమీపంలో విషం తాగి అతను ప్రాణాలు తీసుకున్నాడు. నిందితుడి మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం, పోలీసుల పర్యవేక్షణలో చేవెళ్ల మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజ్ కుమార్ చేసిన దారుణం పట్ల ఆగ్రహంతో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు.

రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో పోలీసులకు ఒక బాండ్ పేపర్ మరియు నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించాయి. తన చావుకు నలుగురు వ్యక్తులు కారణమని, తనపై నమోదైన పోక్సో (POCSO) కేసును ఉపసంహరించుకోవాలని వారు తనను వేధించారని ఆ లేఖలో పేర్కొన్నాడు. కేసును వెనక్కి తీసుకోవాలంటే రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని, ఆ డబ్బు ఇవ్వకపోతే జైలులోనే ఉంచుతామని బెదిరించడం వల్లే తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని అంశాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement