మన పత్రిక వెబ్డెస్క్, కాకినాడ: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు ఊరు ఊరంతా కాలిబూడిదైంది. ఈ ఘటనలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాధితులకు వెంటనే కొత్త ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
కళ్ల ముందే బూడిదైన బతుకులు పండుగ కోసం సరకులు తెచ్చుకునేందుకు కొందరు గ్రామస్థులు తుని పట్టణానికి వెళ్లగా, మరికొందరు ఇళ్ల వద్దే ఉన్నారు. ఇంతలోనే అగ్నిప్రమాదం సంభవించడంతో, మంటలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి శరవేగంగా వ్యాపించాయి. ప్రాణాలు దక్కించుకునేందుకు గ్రామస్థులు పరుగులు తీశారు తప్ప, ఇళ్లలోని సామాగ్రిని కాపాడుకోలేకపోయారు. అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి సర్వం కాలిబూడిదైంది. గ్యాస్ బండ పేలుడు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.
రూ.25 వేల సాయం.. కొత్త ఇళ్లు: సీఎం ఆదేశం ఈ ఘటనపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధితులకు అండగా నిలవాలని, తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయాలని ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు. కొత్త ఇళ్లు పూర్తయ్యే వరకు బాధితులకు వసతి, ఇతర అవసరాలు తీర్చాలని సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన ఆధార్ కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను తిరిగి ఇప్పించేందుకు తండాలోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
