Advertisement

లోకేశ్ రాజీనామా చేయాలి: మాజీ మంత్రి రోజా డిమాండ్

మన పత్రిక, తిరుపతి: డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా డిమాండ్ చేశారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెకండ్ గేట్ వద్ద వైసీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.

జీవో 420 జారీ చేసి అర్హత లేని దాదాపు 427 మందికి అక్రమంగా పోస్టులు ఇచ్చారని, పరీక్షల నిర్వహణలో తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు.

Advertisement

రూ. 7 వేల కోట్ల బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని, దీనివల్ల విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని రోజా పేర్కొన్నారు. ప్రభుత్వం తమ అనుకూల ప్రచార పత్రికలను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల రక్షణను, నిరుద్యోగుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement