Advertisement

అనర్హల రేషన్ కార్డుల తొలగింపునకు సిద్ధం

మన పత్రిక, తెలంగాణ: రాష్ట్రంలో అర్హత లేకుండా ఆహార భద్రత కార్డులు పొందుతున్న వారిపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదాయ పన్ను చెల్లించే వారు, అధిక ఆస్తులు కలిగిన వారి రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయనుంది. లబ్ధిదారుల ఆధార్, పాన్ వివరాలను ఆదాయపన్ను శాఖతో సరిపోల్చి వారి ఆర్థిక స్థితిని పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన 83,545 మంది పేర్లపై ఇంకా రేషన్ పంపిణీ జరుగుతుండగా, దీనివల్ల నిబంధనలకు విరుద్ధంగా రూ.135 కోట్ల వ్యయం జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే పీఎం కిసాన్ డేటా ప్రకారం 52,339 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నప్పటికీ రేషన్ బియ్యం పొందుతున్నట్లు తేలింది. 15 ఎకరాలకుపైగా భూమి కలిగిన 5,866 మంది రైతులు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు 1.05 కోట్లకు చేరుకోగా, అందులో 99.36 లక్షల ఆహార భద్రత కార్డుల కింద ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. అయితే పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.50 లక్షల వార్షిక ఆదాయం పరిమితి ఉన్నప్పటికీ, అధిక ఆదాయం ఉన్నవారు కూడా పేదల ముసుగులో కార్డులు పొందుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 8 లక్షల కుటుంబాలకు ఏటా రూ.25 లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పటికీ రేషన్ సదుపాయాలు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరు ఉచిత బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ మాఫియాతో చేతులు కలిపి భారీ స్థాయిలో అక్రమాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారుల నిర్లక్ష్యం కూడా విమర్శలకు దారి తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే కాక ప్రస్తుత పాలనలో కూడా అర్హతలేని వారికి కార్డులు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ఆహార శాఖ ఇప్పటికే 1.40 లక్షల కార్డులను తొలగించాలని సూచించగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అర్హతలేని వారికి నోటీసులు జారీ చేసి కార్డుల రద్దు ప్రక్రియ చేపట్టనున్నారు.

Advertisement
Advertisement