Advertisement

రైలు ఆలస్యంతో వ్యాపారవేత్తకు నష్టం: రూ.35 వేల పరిహారం చెల్లించాలని

మన పత్రిక, హైదరాబాద్: రైలు దారి మళ్లింపు సమాచారాన్ని ముందుగా అందించకపోవడం వల్ల ప్రయాణికుడు నష్టపోయాడని నిర్ధారిస్తూ దక్షిణ రైల్వే రూ.35,000 పరిహారం చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-1 ఆదేశించింది. రైలు తీవ్ర ఆలస్యం కావడం వల్ల ఒక వ్యాపారవేత్త తన ముఖ్యమైన సమావేశంతో పాటు తిరుగు ప్రయాణ విమానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

కోతాపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ, 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో జరిగే వ్యాపార సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి ఢిల్లీకి రూ.1,428తో ప్రీమియం తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నారు. సెప్టెంబర్ 28న ప్రయాణం కోసం చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు రైలు మార్గాన్ని మళ్లించినట్లు తెలిసింది. ఈ మార్పుపై తనకు ఎలాంటి ఎస్ఎమ్‌ఎస్ లేదా సమాచారం అందలేదని ఆయన కమిషన్‌కు తెలిపారు. మార్గం మళ్లించడం వల్ల రైలు దాదాపు 16 గంటలు ఆలస్యమై సెప్టెంబర్ 30 రాత్రి 10:30 గంటలకు ఢిల్లీ చేరుకుంది. దీనివల్ల ఆయన సమావేశానికి హాజరు కాలేకపోవడమే కాకుండా, తిరుగు ప్రయాణానికి బుక్ చేసుకున్న విమానాన్ని కూడా కోల్పోయి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Advertisement

చెన్నై ప్రయాణికులకు అలర్ట్ పంపలేదని అంగీకారం

విచారణ సమయంలో దక్షిణ రైల్వే స్పందిస్తూ, సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగానే రైలును దారి మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే దారి మళ్లింపు గురించిన ఎస్ఎమ్‌ఎస్ మెసేజ్‌లను విజయవాడ, ఖమ్మం, వరంగల్, నాగ్పూర్ స్టేషన్లలో రైలు ఎక్కే ప్రయాణికులకు మాత్రమే పంపామని, చెన్నైలో ఎక్కే వారికి పంపలేదని రైల్వే అధికారులు కమిషన్ ముందు అంగీకరించారు.

రైల్వే శాఖ సేవల్లో లోపం ఉందని కమిషన్ స్పష్టం చేసింది. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ప్రయాణికుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారని పేర్కొంది. వ్యాపార నష్టానికి సంబంధించిన తగిన ఆధారాలు చూపలేకపోయినప్పటికీ, ప్రయాణికుడికి కలిగిన మానసిక వేదన, అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని దక్షిణ రైల్వే రూ.25,000 పరిహారం, రూ.10,000 కోర్టు ఖర్చుల కింద మొత్తం రూ.35,000 చెల్లించాలని ఆదేశించింది.

Advertisement