Advertisement

ప్రభాస్ ‘ఫౌజీ’ విడుదల వాయిదా?

మన పత్రిక: ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పిరియాడికల్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ అనుకున్న తేదీకి థియేటర్లలోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్వ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న విడుదల చేయాలని భావించినప్పటికీ, నిర్మాణ వర్గాలు ఈ తేదీని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి సిజిఐ, విజువల్ ఎఫెక్ట్స్ సహా ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా వరకు పూర్తి కావాల్సి ఉంది. నవంబర్ నాటికి ప్రభాస్ తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఔట్‌పుట్ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు దర్శకుడు హను రాఘవపూడి మరింత సమయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని 2027 జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వపు నేపథ్యంతో తెరకెక్కుతున్న కథ కావడంతో గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయడం చిత్ర ఇతివృత్తానికి తగినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆ వారంలో వచ్చే ప్రభుత్వ సెలవు కూడా సినిమాకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే, ఒకవేళ విడుదలలో మార్పు ఉంటే డిజిటల్ హక్కుల ఒప్పందాలు, పంపిణీ ప్రణాళికలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి చిత్ర యూనిట్ విడుదల తేదీ మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ‘ఫౌజీ’ థియేట్రికల్ విడుదలపై స్పష్టత రావాలంటే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement