మన పత్రిక, తెలంగాణ వైరల్: పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి కొందరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, గోదావరిఖనిలో కొందరు యువకులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు. నగరంలో పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఎక్కడ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అనే వివరాలను గ్రూప్‌లో పరస్పరం పంచుకుంటూ, ఆ మార్గాలను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఒక యువకుడు పోలీసులకు చిక్కాడు. అతనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఫోన్‌ను పరిశీలించగా ఈ గ్రూప్ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రూప్‌లో ఉన్న మెసేజ్‌లు చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఆలస్యం చేయకుండా అదే ఫోన్ ద్వారా గ్రూప్‌లోకి ప్రవేశించారు. అనంతరం వీడియో సందేశాన్ని పోస్ట్ చేస్తూ సభ్యులకు హెచ్చరిక జారీ చేశారు. గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరి నంబర్లు తమ వద్ద ఉన్నాయని, త్వరలో వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన వెంటనే గ్రూప్ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
‘పోలీస్ మామల స్క్వాడ్’ బట్టబయలు.. వాట్సాప్ గ్రూప్‌లో ఎస్సై ఎంట్రీ

Advertisement