Advertisement

ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి పథకం: విద్యార్థులకు రూ.7.5 లక్షల వరకు రుణం

మన పత్రిక: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి పథకం’ను తీసుకువచ్చింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ పథకం ద్వారా ఏటా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకారం దేశంలోని మొదటి 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో (QHEIs) ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పథకం ముఖ్య లక్షణాలు

ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు ఎటువంటి కొలేటరల్, సెక్యూరిటీ లేదా గ్యారంటర్ లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. అలాగే, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవు. రూ.7.5 లక్షల వరకు తీసుకునే రుణాలపై బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు భారత ప్రభుత్వం 75 శాతం క్రెడిట్ గ్యారంటీని కల్పిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు, రూ.10 లక్షల వరకు తీసుకునే రుణాలపై మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.

Advertisement

రుణం మరియు దరఖాస్తు వివరాలు

షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) మరియు సహకార బ్యాంకుల ద్వారా ఈ రుణాలు పొందవచ్చు. రుణంపై వడ్డీ రేట్లు బ్యాంకుల విధానాన్ని బట్టి సంవత్సరానికి 8.1 శాతం నుండి 18 శాతం వరకు ఉంటాయి. మారటోరియం కాలం మినహాయించి, రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 15 ఏళ్ల గడువు ఉంటుంది. 2024-25 నుండి 2030-31 ఆర్థిక సంవత్సరాల వరకు ఈ పథకం కోసం రూ.3,600 కోట్లు కేటాయించారు.

విద్యార్థులు విద్యా లక్ష్మి అధికారిక పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌లో పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ మరియు ఆధార్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం లాగిన్ అయి, లోన్ అప్లికేషన్ విభాగంలో కోర్సు, కళాశాల పేరు మరియు ఫీజు వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్థితిని కూడా ఇదే పోర్టల్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.

Advertisement