Advertisement

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు: ప్రభుత్వ నిర్ణయాన్ని

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగిస్తూ, ఆగస్టు 1వ తేదీ నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని విక్రయించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఏపీ ప్రజలకు అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని, దీని అమలుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన కొనియాడారు.

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ పంపిణీలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ. 52 చొప్పున, గ్రేడ్-1 పచ్చి బియ్యాన్ని (రా రైస్) కిలో రూ. 50 చొప్పున విక్రయించనున్నారు.

Advertisement

బహిరంగ మార్కెట్ ధరలపై అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, రైస్ మిల్లర్లతో చర్చించి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం సామాన్యుల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement