Advertisement

యూట్యూబర్‌ రమానందనకు మరోసారి నోటీసులు

అద్దంకి: యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కన్సల్టెన్సీ ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం కోసం గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న జె.మోహనరావును 2023లో సంప్రదించారు.

ఈ క్రమంలో మొదట అడ్వాన్స్‌గా రూ.లక్ష, పత్రాల పరిశీలన పూర్తయ్యాక మరో రూ.9.60 లక్షలు కలిపి మొత్తం రూ.10.60 లక్షలు చెల్లించారు. నగదు తీసుకున్నా ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు ఈ ఏడాది జూన్‌లో అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కన్సల్టెన్సీ నిర్వాహకుడు జె.మోహనరావు, ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, కుమారుడు మధుకర్, కోడలు రమానందన, ఆమె తల్లిపై కేసు నమోదు చేశారు. యూకే పౌరసత్వం ఉన్న రమానందన బిగ్‌బాస్ షో ఎంపికల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న ఆమె శుక్రవారం తన న్యాయవాదితో కలిసి అద్దంకి పోలీస్ స్టేషన్‌కు హాజరై అధికారుల నుంచి నోటీసులు స్వీకరించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement