మన పత్రిక వెబ్డెస్క్, నెల్లూరు: నెల్లూరు నగర రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, నగర అభివృద్ధికి బాటలు వేసేలా కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు చుట్టూ దాదాపు రూ.1,930 కోట్ల భారీ వ్యయంతో 83.64 కిలోమీటర్ల మేర ‘ఔటర్ రింగ్ రోడ్డు’ (ORR) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎక్కడ మొదలై.. ఎక్కడ వరకు? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాలు, 38 గ్రామాల మీదుగా సాగుతుంది. లేబూరు బిట్-2 వద్ద ప్రారంభమై రాజుపాళెం జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఇందులో కీలక అంశం ఏంటంటే.. పెన్నానదిపై 1200 మీటర్ల పొడవుతో భారీ వంతెనను నిర్మించనున్నారు.
నియోజకవర్గాల వారీగా రోడ్డు విస్తీర్ణం:
- కోవూరు: 41.44 కి.మీ
- సర్వేపల్లి: 20.94 కి.మీ
- నెల్లూరు రూరల్: 19.64 కి.మీ
- ఆత్మకూరు: 1.02 కి.మీ
కూటమి ప్రభుత్వం రాగానే.. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 2018లోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అంకురార్పణ చేశారు. అప్పట్లో 42 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ పనులు ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రతిపాదనలను పరిశీలించి, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసింది.
శరవేగంగా అడుగులు ఇటీవలే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మేయర్, నుడా అధికారులతో చర్చించి రోడ్ అలైన్మెంట్పై (Alignment) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిధులు మంజూరు చేయించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని, తద్వారా ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
