Advertisement

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు: నలుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు

మన పత్రిక: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆగస్టు 1న ఆయన చేతుల మీదుగా ప్రతిష్టాత్మక భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది.

ఈ పర్యటనలో పారిశుద్ధ్యం మరియు ఇతర ప్రజా అవసరాల పర్యవేక్షణ కోసం మున్సిపల్ పరిపాలన శాఖ నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ ఎం ధ్యాన చంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ ఈ పనులను పర్యవేక్షించనున్నారు.

Advertisement

ఈ అధికారులకు సహాయంగా పనిచేసేందుకు వివిధ కార్పొరేషన్ల నుంచి 26 మంది నాన్-కేడర్ అధికారులను కూడా నియమించారు. నియమితులైన అధికారులందరూ తక్షణమే విజయనగరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలను సిద్ధం చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

Advertisement