Advertisement

రాజమండ్రి షూటింగ్ సెట్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణ

మన పత్రిక: ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రిలో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రమాదవశాత్తు ఆయన ఎడమ మోకాలికి గాయం కావడంతో, తొలుత స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బుధవారం ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ (ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆసుపత్రికి తరలించారు.

ఏఐజీ ఆసుపత్రి వైద్యుల సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలంలో వాపుతో పాటు రక్తపు గడ్డలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. దీనివల్ల కండరం చిట్లి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఆయనకు విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ ప్రమాదంపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ, గాయం తీవ్రమైనది కాదని, చిన్నపాటి సర్జరీ తర్వాత బాలకృష్ణ త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement