Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం జనసేన శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలి: నాదెండ్ల మనోహర్

మన పత్రిక: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీలో అంతర్గత విబేధాలు, గ్రూపు రాజకీయాలకు తావులేకుండా అందరూ కలసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం కోసమే మనమంతా పనిచేస్తున్నామని, నాయకులకు వ్యక్తిగత వర్గాలు వద్దని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి Nadendla Manohar కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

గత కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ జనసేన ధైర్యంగా నిలబడిందని మనోహర్ గుర్తుచేశారు. ఆ సమయంలో విజయవాడలోని 39 డివిజన్లలో పోటీ చేసి సుమారు 50 వేల ఓట్లు సాధించడమే పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలానికి నిదర్శనమని చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు కేవలం గుర్తుపైనే ఆధారపడకుండా వ్యక్తిగత విశ్వసనీయతను, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. కేవలం ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినంత మాత్రాన ఓట్లు రావని, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగమైనప్పుడే మద్దతు లభిస్తుందన్నారు.

Advertisement

ప్రస్తుతం జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అన్ని పదవులను ఒకేసారి ఆశించడం సరికాదని ఆయన అన్నారు. దశాబ్దాలుగా ఉన్న ఇతర కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ క్రమంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.

Advertisement