Advertisement

నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం తీరును తప్పుబట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్

మన పత్రిక, హుస్నాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారాన్ని పూర్తిగా కప్పిపుచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుత నిరసనలను అణచివేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీల అరెస్టులకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ మహాధర్నా నిర్వహించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ప్రజాస్వామ్య చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని మంత్రి పొన్నం విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులైన విద్యార్థులకు పునఃపరీక్ష నిర్వహించాలని లేదా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. లీకేజీకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే జంతర్ మంతర్ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement