మన పత్రిక: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అభిమానులమని నమ్మించి ఎనిమిది మంది దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన బాలానగర్ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బూర్గుల పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ విషయంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, తానే తీసుకున్నానని అంగీకరించి తిరిగి ఇస్తానని చెప్పాడు. అయితే ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం కొమురక్క అతడిని మందలించారు.
దీంతో ఆగ్రహించిన శ్రీనాథ్ తన స్నేహితులకు విషయం చెప్పగా, వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్ అనే ఎనిమిది మంది మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని చెప్పి ఫొటో దిగాలని నమ్మించారు. అనంతరం రామ్‌చరణ్ వాగ్వాదానికి దిగగా, వంశీకృష్ణ రాయితో కొమురక్కపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఆమె సోదరుడు యాదయ్యపై వికాస్ రాయితో దాడి చేశాడు. చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడిచేతిని గాయపరిచాడు. మధ్యలోకి వచ్చిన గ్రామస్థుడు రామును కూడా రాళ్లతో కొట్టారు. దాడి అనంతరం ‘ఎప్పటికైనా చంపుతాం’ అంటూ బెదిరింపులకు దిగారు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితులు ద్విచక్ర వాహనం వదిలేసి పరారయ్యారు. బుధవారం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
