Advertisement

లక్నో స్కూల్లో నర్సరీ విద్యార్థిపై దాడి, 12 నిమిషాల పాటు వేధింపులు

మన పత్రిక, లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని వృందావన్ యోజనలో ఉన్న ఏఎల్ఎస్ అకాడమీ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోని నర్సరీ తరగతి గదిలో ఐదేళ్ల విద్యార్థిపై క్లాస్ మానిటర్‌గా వ్యవహరిస్తున్న ఒక బాలిక సుమారు 12 నిమిషాల పాటు నిర్దాక్షిణ్యంగా దాడి చేసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చి కలకలం రేపుతున్నాయి.

తరగతి గదిలో ఉపాధ్యాయురాలు లేని సమయంలో ఈ దాడి జరిగింది. విద్యార్థులందరినీ డెస్క్‌లపై తలలు దించుకుని పడుకోవాలని ఆదేశించి టీచర్ బయటకు వెళ్లారు. మానిటర్‌గా ఉన్న బాలికకు అందరినీ పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. అయితే, ఐదేళ్ల నర్సరీ విద్యార్థి తల పైకెత్తడంతో ఆగ్రహించిన మానిటర్, అతనిని చెంపలపై కొట్టడం, జుట్టు పట్టి లాగడం మరియు వీపుపై గుద్దుతూ హింసించింది. బాధితుడు గది నుండి పారిపోవడానికి ప్రయత్నించగా, తలుపులకు గడియపెట్టి మరి దాడిని కొనసాగించింది. గదిలోని ఇతర విద్యార్థులు భయంతో తలలు దించుకుని ఉండిపోయారు.

Advertisement

ఆసుపత్రిలో చికిత్స మరియు పాఠశాల చర్యలు

సాయంత్రం ఇంటికి చేరుకున్న బాలుడి ముఖం వాచిపోయి, తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని పీజీఐ ట్రామా సెంటర్‌కు తరలించారు. గురువారం తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పాఠశాల వద్ద తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్, దాడికి పాల్పడిన సదరు విద్యార్థినిని పాఠశాల నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement