Advertisement

నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: కొట్నాక తిరుపతి

మన పత్రిక, లక్షెట్టిపేట: నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ కొట్నాక తిరుపతి తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నించిన నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షా పత్రాలను లీక్ చేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని కొట్నాక తిరుపతి ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెల్పుతున్న రాహుల్ గాంధీ పట్ల పోలీసులు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ప్రశ్నించే గొంతులపై అణచివేత

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈడీ, సీబీఐ మరియు పోలీసులను ఉపయోగించి ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని తిరుపతి ఆరోపించారు. విద్యార్థులపై దాడులు చేయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను పట్టించుకోవడం లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు.

Advertisement