Advertisement

అమ్మను బలి చేస్తారనుకోలేదు: కొండా సుస్మిత ఆవేదన

మన పత్రిక: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడినందుకే తన తల్లిని రాజకీయంగా బలి చేశారని, కేబినెట్ నుంచి తొలగించడం తీవ్రమైన దెబ్బ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

కొండా సురేఖ ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ప్రజా నాయకురాలిగా ఎదిగారని, ఆమె నిర్వహించిన మంత్రిత్వ శాఖలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని సుస్మిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచీ తమ తల్లిపై వ్యక్తిగత కక్ష ఉందని, ఆ కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

Advertisement

తాను గతంలో మాట్లాడినప్పుడు ఒక కుటుంబ రాజకీయాలు, వ్యక్తి ప్రవర్తన గురించి మాత్రమే ప్రస్తావించానని, కాంగ్రెస్ పార్టీని కానీ, అధిష్ఠాన నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కానీ ఒక్క మాట అనలేదని వివరించారు. స్వయంకృషితో ఎదిగిన సీనియర్ బీసీ మహిళా నాయకురాలిపై ప్రతీకార చర్యలు సరికాదని, అధిష్ఠానం వద్ద కావాలనే దుష్ప్రచారం చేశారని ఆవేదన చెందారు. తన తల్లి గౌరవం కోసం పోరాడతానని కొండా సుస్మిత తెలిపారు.

Advertisement