హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన కార్తీక మాసం 2026 నవంబర్ 10వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 8వ తేదీతో ముగియనుంది. ఈ మాసంలో భక్తులు పరమశివుడు మరియు శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానాలు ఆచరించడం, శివాలయాలను దర్శించడం, తులసి మొక్కల వద్ద దీపారాధన చేయడం మరియు సోమవారాల్లో ఉపవాసాలు ఉండడం ముఖ్యమైన సంప్రదాయాలుగా వస్తున్నాయి.
ముఖ్యమైన పండుగలు మరియు సోమవారాల తేదీలు
తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో నవంబర్ 13న నాగులచవితి, నవంబర్ 14న నాగపంచమి ఉంటాయి. నవంబర్ 16న మొదటి కార్తీక సోమవారం వస్తుంది. ఆ తర్వాత నవంబర్ 21న క్షీరాబ్ధి ద్వాదశి, నవంబర్ 23న రెండవ కార్తీక సోమవారం, నవంబర్ 24న కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతాయి. నవంబర్ 30న మూడవ కార్తీక సోమవారం, డిసెంబర్ 7న నాల్గవ కార్తీక సోమవారంతో పాటు మాస శివరాత్రిని జరుపుకుంటారు.
ఈ పవిత్ర మాసంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. నాగులచవితి, నాగపంచమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి, సింగరాయపాలెం వంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు విశేషంగా దీపారాధనలు చేసి పూజలు నిర్వహిస్తారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
