Advertisement

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 630, నిఫ్టీ 209 పాయింట్లు

మన పత్రిక: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తున్నాయి. దీనికితోడు దేశీయ రూపాయి విలువ బలపడటం, విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా నాలుగు సెషన్లుగా నికర కొనుగోలుదారులుగా ఉండటంతో మదుపరులలో సానుకూల వాతావరణం నెలకొంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం వృద్ధితో కొనసాగుతున్నాయి.

మార్కెట్ ప్రారంభంలోనే గ్యాప్ అప్‌తో మొదలైన సూచీలు లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 789 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కొంతమేర తగ్గినప్పటికీ, తిరిగి పుంజుకుని ఆ తర్వాత మరిన్ని లాభాలను నమోదు చేసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 189 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 630 పాయింట్ల లాభంతో 78,724 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 209 పాయింట్లు పెరిగి 24,592 స్థాయికి చేరింది.

Advertisement

లాభనష్టాల్లో ఉన్న ప్రముఖ షేర్లు

బీఎస్ఈ సెన్సెక్స్ జాబితాలోని 25 షేర్లు లాభాల్లో పయనిస్తుండగా, 5 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో అత్యధికంగా 4.08 శాతం మేర లాభపడగా, ఇన్ఫోసిస్ 2.68 శాతం, టీసీఎస్ 2.65 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.52 శాతం, ఐటీసీ 2.49 శాతం మేర లాభాలను ఆర్జించాయి.

మరోవైపు సన్‌ఫార్మా 1.28 శాతం నష్టపోగా, భారతీ ఎయిర్‌టెల్ 1.06 శాతం, మారుతి 0.48 శాతం, టెక్ మహీంద్రా 0.47 శాతం, ఎన్టీపీసీ 0.14 శాతం మేర తగ్గుముఖం పట్టాయి.

Advertisement