పశ్చిమ బెంగాల్‌లోని ప్లాంట్ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ తాగునీటి శాంపిల్ నాణ్యతా పరీక్షలో విఫలం కావడంతో బిస్లరీ ఇంటర్నేషనల్‌పై చట్టపరమైన విచారణ చర్యలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతి ఇచ్చింది. జల్పైగురి జిల్లాలోని తేలిపారా గ్రామంలో ఉన్న బిస్లరీ ప్లాంట్ నుంచి సేకరించిన శాంపిల్‌లో కోలీఫాం బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాథమిక, రెఫరల్ ప్రయోగశాలలు రెంటింటిలోనూ ధృవీకరణ అయింది. మురుగునీటి కాలుష్యం, లీక్ అవుతున్న పైప్‌లైన్లు మరియు దెబ్బతిన్న నీటి మౌలిక సదుపాయాల ద్వారా ఇటువంటి బ్యాక్టీరియా నీటి సరఫరాలోకి ప్రవేశించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ తీవ్రమైన ఉల్లంఘనను గుర్తించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, 2026 ఆగస్టు 12న ‘PB 201’ అనే నిర్దిష్ట బ్యాచ్ నీటి అమ్మకాలను తక్షణమే నిలిపివేసింది.
భారతదేశంలోని ప్రముఖ ప్యాకేజ్డ్ తాగునీటి కంపెనీలలో ఒకటైన బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణకు ఆమోదం తెలపడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో గోవాలోని ఈ కంపెనీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి శాంపిల్‌లో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు తేలింది. బిస్లరీ దీనిని సవాలు చేయడంతో శాంపిల్‌ను రెఫరల్ ఫుడ్ లేబొరేటరీకి పంపగా, అక్కడ పాలిన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు తేలి సురక్షితం కాదని ప్రకటించారు. దాంతో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 కింద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణ చేపట్టింది. ఈ నివేదిక సమయానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బిస్లరీల నుంచి ప్రతిస్పందన అందుబాటులో లేదు.
సోమవారం బిస్లరీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ, తమ ప్యాకేజ్డ్ తాగునీరు వినియోగానికి సురక్షితమైనదని వాదిస్తూనే, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి కలిసి పనిచేస్తామని తెలిపింది. మరోవైపు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ రాజీవ్ పుంఛాని మాట్లాడుతూ, రాబోయే 1 నుండి 2 నెలల్లో ప్రయోగశాల పరీక్షలు పూర్తి చేసేలా దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ తాగునీటి శాంపిళ్ల తనిఖీలను విస్తృతం చేసినట్లు ప్రకటించారు. ప్రజాందోళనకు కాకుండా నిబంధనల అమలుకే ఈ చర్యలని ఆయన స్పష్టం చేశారు. గడిచిన సంవత్సరాల్లో ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాలిక్ పానీయాల తయారీదారులు, ఈ-కామర్స్ వేదికలపై నిఘా ఉంచామని, త్వరలో ఆహార ఉత్పత్తుల ప్యాకేజింగ్ మెటీరియల్స్ పై కూడా తనిఖీలు ప్రారంభిస్తామని వివరించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
