WhatsApp
Advertisement

ఐపీఓ ముంగిట ఫ్లిప్‌కార్ట్ సంచలనం.. వందలాది ఉద్యోగులపై వేటు!

మన పత్రిక వెబ్​డెస్క్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. వార్షిక పనితీరు (పెర్ఫార్మెన్స్) సమీక్షల ఆధారంగా సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

త్వరలో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) కు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న సంస్థ.. ఒకవైపు వివిధ విభాగాల్లో సీనియర్ స్థాయి అధికారులను (వైస్ ప్రెసిడెంట్లను) కొత్తగా నియమించుకుంటూనే, మరోవైపు ఈ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూడటంతో, ఖర్చుల నియంత్రణలో భాగంగానే ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ఐపీఓ కోసం సింగపూర్ నుంచి తన ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు మారుస్తున్న తరుణంలో జరిగిన ఈ లేఆఫ్స్.. ఈ-కామర్స్ రంగ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

అయితే, తొలగించిన కచ్చితమైన సంఖ్యను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement