Advertisement

వివాదంలో తెలంగాణ జానపద గాయకుడు ఈశ్వర్ సాయి

మన పత్రిక: తెలంగాణ జానపద గాయకుడు ఈశ్వర్ సాయి ఓ సామాజిక మాధ్యమ వీడియో కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం అర్థరాత్రి వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఈ ఘటన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ గదిలోని మంచంపై కూర్చుని ఉండగా, ఈశ్వర్ సాయి బాత్‌రూమ్ నుంచి బయటకు రావడం కనిపిస్తోంది. అనంతరం అక్కడ ఉన్న పలువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు దృశ్యాల ద్వారా తెలుస్తోంది.

ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. వీడియోలో ఉన్న మహిళతో తన భర్తకు సంబంధం ఉందంటూ ఆమె ఆరోపించారని, ఈ విషయమై పోలీసులను కూడా ఆశ్రయించారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారా లేదా అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం నమోదైన అంశాలన్నీ ఆరోపణల స్థాయిలోనే ఉన్నందున, పోలీసులు లేదా సంబంధిత వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Advertisement

ఇటీవలి కాలంలో తెలంగాణ జానపద పాటల ద్వారా ఈశ్వర్ సాయి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వైష్ణవి సోనీతో కలసి పాడిన ‘బాసింగ బలలు’ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రసిద్ధి చెందింది. వివాహ వేడుకలు, డీజే ఈవెంట్లలో ఈ పాట ఎక్కువగా వినిపిస్తూ ఆయన్ను శ్రోతలకు దగ్గర చేసింది. గతంలో జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌తో కలసి ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి అనేక పాటల్లో ఈశ్వర్ సాయి పనిచేశారు.

Advertisement